Thursday 29 March 2012

పచ్చళ్ళు-2

పెరుగు పచ్చళ్ళు-1


మార్చి నెల, ఆఖరి వారం. అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. మరి ఏప్రెల్, మే నెలలు తలుచుకుంటే భయమేస్తోంది. ఎండా కాలం కూరలు దొరకవు. దొరికినా చాల ఖరీదు. పోనీ డబ్బు పోసి కొన్నా ఎ వేపుడో చేసినా తినాలని అనిపించదు. అయినా నూనెలు, మషాలాలు వేసవిలో ఎక్కువగా  తినకూడదు. 

అందుకని రోజువారీ పచ్చళ్ళు చేసుకుని అన్నంతోనో, రొట్టెల తోనో తింటే, ఆరోగ్యం, నోటికి రుచి, ఖర్చూ తక్కువే. 

ముందుగా పెరుగు పచ్చళ్ళతో మొదలు పెడదాం. వేసవిలో పెరుగు, మజ్జిగ ఆరోగ్యానికి మంచివి. నోటికి హితవు అనిపిస్తాయి. మన భోజనాలలో పెరుగు లేదా మజ్జిగాన్నం ఆఖరున తినటం అలవాటు. పెరుగులో ఉప్పుకాని చక్కెర వేసుకుని అన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. దీంతో పాటు నీరుల్లిపాయ ముక్కలు కాని, నిమ్మ, ఉసిరి, చింతకాయ పచ్చళ్ళు లేదా మంచి మామిడి పళ్ళు కాని తింటే ఇంక వేరే చెప్పాలా.

అయితే ఎప్పుడు ఉత్తి పెరుగే కాక పెరుగు పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. తినటానికి విసుగు అనిపించదు. మరి ఇంకేదుకు ఆలస్యం?

ముందుగా ఒక మాట:
  1. పచ్చడికి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. మరీ పులుపు ఉంటే చాలా ఉప్పు కారం వెయ్యాలి. రుచిగా ఉండదు. అసలు పులుపు ఇష్టం లేని వాళ్ళు తాజాగా తోడు పెట్టుకున్నది వాడుకోవచ్చు.
  2. పెరుగు చిక్కగా (గడ్డ పెరుగు) ఉంటే మంచిది. కొంత మందికి పచ్చడి బాగా  చిక్కగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి  కొంచెం   జారుగా   ఉండాలి. 
  3. ఏదైనా ముందుగా పెరుగును ఒక మల్లు గుడ్డలో వడకట్టి నీరు విడిగా పెట్టుకోండి. ఈ పెరుగును బాగా గరిటెతో గిలక కొట్టండి. ఇలాచేస్తే చిక్కగా creamy గా ఉంటుంది. తరువాత మీకు కావాలంటే నీళ్ళు(ముందు వేరు చేసి పెట్టుకున్నవి కాని లేదా మంచి నీళ్ళు కాని) వాడుకోండి.
  4. పెరుగు తక్కువ వెన్న ఉన్న పాలతో చేస్తే ఆరోగ్యానికి మంచిది.  బరువు తగ్గాలనుకునే వాళ్ళు పిల్లలు తప్ప మిగిలిన వారందరూ  ఈ పెరుగు వాడటమే మంచిది. 
  5. ఇందులో పచ్చి మిరప కారమే బాగుంటుంది. మనం ఎటూ పోపులో ఎండు మిరప కాయలను కూడా వాడతాము. ఉత్తరాదిన ఎక్కువగా ఎర్ర కారం  వాడతారు. మీ ఇష్టాన్ని బట్టి వాడుకోండి. నేను చెప్పే వాటిలో కారం ఎక్కువగా ఉంటుంది. మీరు తినేదానిని బాట్టి  ఎక్కువ తక్కువ వాడుకోండి. ఎండాకాలం తక్కువ తినడమే మంచిది.
  6. పచ్చి మిరపకాయలు పొడుగ్గా గాటు  పెట్టి (చీల్చి)  వేసినా లేదా చీల్చినవి కొంచెం నూనె/నెయ్యిలో వేయించినా కారం తక్కువ ఉంటుంది. ముక్కలుగా కోసి అలాగే వేయచ్చు లేదా వేయించుకోవచ్చు. ఇలా వేస్తే కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కచ్చా-పచ్చాగా దంచి వేసుకోవచ్చు.ఇది ఇంకా కారం ఉంటుంది. ఇదికూడా వేయించి వేస్తే రుచిగాను కొంచం కారం తక్కువగాను  ఉంటుంది. 
  7. వేయించినప్పుడు పచ్చి మిర్చి కాని లేదా ఎర్ర కారం కాని కారం తక్కువ ఉంటుంది.
  8. మిరప  కాయలు చీల్చి వెసినా, ముక్కలు చేసి వేసినా కావలసిన వాళ్ళు తింటారు. అదే దంచి వేస్తే తక్కువ తినే వారికీ కష్టం.  మీరు కారం వేసేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. 
  9. తాళింపు మన ఆంద్ర వంటలకి ప్రత్యేకత. మన పచ్చళ్లలో తప్పక తాళింపు వేస్తాము. ఉత్తరాదిన మాత్రం చాలా మటుకు వేయరు. వేసినా మన లాగ రక రకాలుగా ఉండవు. చాలా తక్కువ దినుసులు వాడతారు. నూనె/నెయ్యి తక్కువగా వాడితే మంచిది.
  10. కొత్తిమీర తురుము, కర్వేపాకు(తాళింపులో) వంటివి వేసుకుంటే, రుచిగాను ఉంటాయి, ఆరోగ్యానికీ మంచిది.
  11. పచ్చడి చేసిన తరువాత కొంత సేపు ఫ్రిజ్జిలో పెడితే రుచి బాగుంటుంది. పులుపు ఎక్కదు. కాని మరీ చల్లగా ఉండకూడదు.
  12. ఇవి అన్నం/రొట్టెలే  కాక మధ్యాహ్నం ఎండగా ఉన్నపుడు snack లాగా  ఉత్తగా తినవచ్చు.
  13.  నేను చెప్పే కొలతలలో 1  కప్పు అంటే 200-250 ml అన్న మాట. అది 2-3 కి సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. 
  14. అలాగే వాడే పచట్లోకి కూరల/పళ్ళ పరిమాణాన్ని మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. 
నేను మరీ ఇంతలా ఎందుకు చెపుతున్నాను అంటే, కొత్తగా వంట చేసుకునే వారికోసం, అసలు వంట రాని వాళ్ళ కోసం. బాగా చేయి తిరిగిన వాళ్ళకి ఇవ్వని తెలుసు అనుకోండి. 



1. సాదా  పెరుగు  పచ్చడి 


కావలసినవి:
పెరుగు      1 కప్పు 
పచ్చి మిర్చి   1-2
కొత్తిమీర తరుగు  1 Tbsp
కర్వేపాకు  2  రెబ్బలు 
పసుపు   2-3 చిటికెలు
చక్కర    1/2 tsp
ఉప్పు     తగినంత 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలు


తయారు చేసే విధానం:

  • ముందుగ తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే పచ్చి మిర్చిని గాటు పెట్టి తాళింపులో వేయించుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి.
  • ఒక  గిన్నెలో పెరుగు  తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
  • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 

2. ఆవ పెరుగు పచ్చడి 

కావలసినవి:
పెరుగు      1 కప్పు 
ఆవ   పొడి  1 tsp 
పచ్చి మిర్చి   1-2
కొత్తిమీర తరుగు  1 Tbsp
కర్వేపాకు  2  రెబ్బలు 
పసుపు   2-3 చిటికెలు
చక్కర    1/2 tsp
ఉప్పు     తగినంత 


తాళింపు :
నూనె  1 Tbsp
శెనగ  పప్పు   1 tsp
మినపప్పు     2 tsp
ఆవాలు        1 tsp
జీలకర్ర         1 tsp
ఎండు మిర్చి  1 (ముక్కలుగ తుంచినది)
ఇంగువ       2-3 చిటికెలు



తయారు చేసే విధానం:

  • ముందుగ తాళింపు  వేసుకుని పెట్టుకోండి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే పచ్చి మిర్చిని గాటు పెట్టి తాళింపు లో వేయించుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి.
  • ఒక  గిన్నెలో పెరుగు, ఆవ పొడి తదితర సామాగ్రి  అంతా వేసుకుని బాగా కలపండి. 
  • తాళింపు  కూడా వేసి కలుపుకుని కొంచెం చల్లపరచి వడ్డించండి. 

ఇవి  అన్నంతో కానీ చేపాతిలు, రొట్టెలు, బిర్యాని, ఫ్రైడ్ రైస్, పులిహోరతో కాని బాగుంటాయి. తీపి ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోవద్దు.



మీ...అనామిక....

No comments: